టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించిన వ్యవహారం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. సిట్ విచారిస్తున్నా కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపిన రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లను సిట్ రెండవ రోజు కూడా విచారించింది. ఈ విచారణలో నిందితులు వెల్లడిస్తున్న వివరాలు, వారి కాల్‌డాటాను విశ్లేషిస్తున్న సమయంలో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిని చూసి సిట్ బృందమే ఆశ్యర్యం వ్యక్త పరుస్తోంది. తొలిరోజు 42 అంశాల ప్రశ్నావళిని ముందుపెట్టి, అధికారులు నిందితుల నుంచి సమాధానాలను రాబట్టారు. ఈ కేసులో నిపుణులైన పోలీసులు.. కాల్‌డాటాను విశ్లేషిస్తుండగా, ఢిల్లీలో స్విచ్ వేస్తే కరీంనగర్‌లో బల్బు వెలిగింది. ఢిల్లీ బీజేపీ పెద్దల ఆదేశాలతో రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా ఈ ఆపరేషన్‌లో పరోక్షంగా పాలుపంచుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. బీజేపీ నాయకులు కమల్ ఫైల్స్‌లో నేరుగా పాల్గొనకుండా బంధువులు, సన్నిహితులతో కథ నడిపించారని సమాచారం.
ఎమ్మెల్యేల కొనుగోళ్లతో తమకేమీ సంబంధం లేదని రోజుకో ప్రెస్‌మీట్ పెడుతూ, విచారణను ఆపేందుకు కోర్టు మెట్లు ఎక్కుతూ, గుళ్లలో ప్రమాణాలు చేస్తూ అష్టకష్టాలు పడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని అడ్డంగా బుక్ చేసే ఆధారం బయటకొచ్చింది. ముగ్గురు నిందితుల్లో ఒకరైన నందకుమార్‌తో బండి బంధువైన కరీంనగర్ న్యాయవాది అక్టోబర్ 14న అరంగంటపాటు ఫోన్‌లో మాట్లాడినట్టు కాల్‌డాటా నిపుణులు తేల్చారని విశ్వసనీయ సమాచారం. అక్టోబర్ 26న సింహయాజి తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసింది కూడా బండి సంజయ్ బంధువేననే ఆధారాలు లభించాయని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఆడియో టేప్స్ బయటికి వచ్చినప్పటి నుంచి సదరు న్యాయవాది కోర్టుకు కూడా వెళ్లటం లేదని సమాచారం. మరికొందరు రాష్ట్ర బీజేపీ నేతలు ఈ ఆపరేషన్‌కు పరోక్షంగా సహకరించారనే ఆధారాలు కూడా ఉన్నాయని టీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి. బండి ప్రమేయం లేకుండా బంధువు సొంతంగా ఈ వ్యవహారం నడిపే అవకాశమే లేదని, అయినా తడిబట్టలతో ఎలా ప్రమాణం చేశాడన్న చర్చ కొనసాగుతోంది.