Brs Party 002 1670594434

జాతీయ పార్టీగా ఎదిగేందుకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న అవకాశాలివే..

Share it >>

పుబ్బల పుట్టి.. మఖల పోతది అని రాజకీయ ప్రత్యర్థులు గేలి చేస్తుంటే.. పట్టు వదలని విక్రమార్కుడి వలె గట్టి ప్రయత్నం చేసి.. రాష్ట్రాన్నే సాధించిన ఘనుడు కేసీఆర్. తిరుగులేని ప్రజాబలంతో.. ఉద్యమ ప్రస్థానంతో రాష్ట్రావతరణ అనంతరం జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. హేళన చేసిన ప్రత్యర్థులందరూ తోకలు ముడిచి.. కేసీఆర్ ముందు మోకరిల్లారు. గెలవలేని శిఖండులు.. పత్తా లేకుండా పోయారు. ఆయన చాలా ప్రసంగాల్లో చెప్పే పద్యం..

‘ఆరంభింపరు నీచ మానవుల్ విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘనిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్’

అంటూ ఏనుగు లక్ష్మణ కవి చెప్పిన పద్యంలోలా.. ధీరులు ఒక పని ప్రారంభిస్తే దాని ఫలితం సాధించే వరకు నిద్రపోరు. కేసీఆర్ కూడా ఆ కోవకు చెందిన వారే.

kcr1

తెలంగాణ అనే పదాన్నే నిషేధించిన అసెంబ్లీ సాక్షిగా.. అసెంబ్లీకే తెలంగాణ అసెంబ్లీ అని పేరు మార్చేంతగా ఆయన పంతం ఉంటుంది. దేశ రాజకీయాల్లోకి ప్రవేశించే క్రమంలో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా జాతీయ పార్టీగా మలిచే క్రమంలో కూడా ఆయన అల్లాటప్పాగా వ్యవహరించడం లేదు. పక్కా ప్లాన్ ప్రకారమే.. భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకొని కేసీఆర్ కార్యరంగంలోకి దిగారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే ఓట్లు, సీట్లు మాత్రమే ప్రాతిపాదిక. ఎంతమంది జనబలం ఉన్నా.. ఎన్ని బహిరంగ సభలు లక్షలాది ప్రజాసందోహంతో విజయవంతం అయినా.. అంతిమంగా ఒక పార్టీ బలాన్ని, భవిష్యత్తును నిర్ణయించేవి ఓట్లు, సీట్లు మాత్రమే. అందుకే.. కేసీఆర్ వాటి మీద దృష్టి పెట్టారు. భారత రాష్ట్ర సమితి పార్టీకి జాతీయ హోదా రావాలంటే తక్షణంగా అవసరమైన 6శాతం ఓట్లను సాధించేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో ఉన్న జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎ:, బీఎస్పీ, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల సరసన బీఆర్ఎస్ ని కూడా చేర్చేందుకు ఆయన పక్లా ప్లాన్ తో ఉన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం రూల్స్ ప్రకారం ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తించబడాలంటే తక్కువలో తక్కువ 4 రాష్ట్రాల్లో కనీసం 6శాతం ఓట్లు సాధించాలి. లేదంటే.. మూడు రాష్ట్రాల్లో 11 లోక్ సభ సీట్లు పొందాలి. లేదంటే నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు సాధించాలి. అయితే.. వీటన్నింటిలో తొలుత ఆరు శాతం ఓట్లు సాధించడం మీదనే కేసీఆర్ దృష్టి పెట్టనున్నారు. తెలుగు ప్రాంత ప్రజలు ఎక్కువగా ఉన్న కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, న్యూఢిల్లీ వంటి ప్రాంతాల్లో పోటీలో అభ్యర్థులను నిలుపనున్నారు. జాతీయపార్టీ హోదా వచ్చేందుకు అవసరమైన ఓట్లు సాధించిన తర్వాత బీజేపీని వ్యతిరేకించే పార్టీలను ఏకతాటిపైకి తెస్తారు. అనంతరం బీజేపీ ఓట్లను బీఆర్ఎస్ ఓట్లుగా మలుచుకునే ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్ అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ విధానాలను వ్యతిరేకించే పార్టీలతో కలిసి పని చేస్తారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలోనే ఆబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని క్లియర్ గా బీఆర్ఎస్ పార్టీ విధానాన్ని ప్రకటించిన కేసీఆర్ దేశవ్యాప్తంగా రైతు, వ్యవసాయానికి సంబంధించిన అంశాల్లో దూకుడుగా వ్యవహరించే అవకాశాలున్నాయి.

 

Leave a Comment