కేంద్రంలోని బీజేపీ సర్కారుపై పీడీపీ అధ్యక్షురాలు, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ పాలనతో జమ్ముకశ్మీర్ ధ్వంసమైందని ధ్వజమెత్తారు. జమ్ములో పరిస్థితులు మెరుగుపడకుండా.. జమ్ము అభివృద్ధి చెందకుండా బీజేపీ అడ్డుకుంటుందని ఆమె విమర్శించారు. కశ్మీరీ పండిట్‌ల సంపాదనను, రేషన్‌ను కేంద్రం నిలిపివేస్తుందని మండిపడ్డారు. కశ్మీరీ పండిట్‌ల సంఘర్షణను బీజేపీ ఓట్ల కోసం వాడుకుంటున్నదని విరుచుకుపడ్డారు.
కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి చెందిన ఒక విభాగంగా మారిపోయిందని, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ మతం పేరుతో ప్రచారం చేస్తుంటే.. కేంద్ర ఎన్నికల సంఘం మౌనంగా ఉండటాన్ని ముఫ్తీ ఆక్షేపించారు. కేంద్రం ఎన్నికల సంఘం బీజేపీ చెప్పినట్లు ఆడుతుందని ఆమె మండిపడ్డారు.