తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై టీఆర్ఎస్ పార్టీని స్థాపించి.. రాష్ట్ర సాధన వరకు విశ్రమించకుండా అలుపెరుగని పోరాటం చేసిన కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లో తనదైన మార్క్ వేసేందుకు తొలి అడుగు ప్రారంభించారు. పట్టు వదలని విక్రమార్కుడై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. నవజాత రాష్ట్రమైనప్పటికీ.. అభివృద్ధిలో దేశంలోని పెద్ద రాష్ట్రాలను దాటేసి వేగంగా ముందుకెళ్లిందంటే అది కేసీఆర్ పాలనా దక్షత. మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత సంక్షేమం లక్ష్యంగా ఆయన రూపొందించిన పథకాలు.. జనాలకు ఎంతో దగ్గరయ్యాయి. దీంతో రెండోసారి కూడా టీఆర్ఎస్ పార్టీకే ప్రజా మద్ధతు లభించింది.
రాష్ట్రంలో టీఆర్ఎస్ తో పాటు.. దేశంలో బీజేపీ సైతం దుష్ట రాజకీయాలతో రెండోసారి అధికారాన్ని చేపట్టింది. బీజేపీ పాలనలో దేశ అధోగతి పాలవుతున్న విషయాన్ని గమనించిన కేసీఆర్ గత ఆరేండ్లుగా దేశ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, సామాజిక వైరుధ్యాలను నిశితంగా పరిశీలించారు. దేశంలో మిగతా రాష్ట్రాల కంటే అన్నీ రంగాల్లో ముందున్న తెలంగాణను దేశానికి ఆదర్శంగా, మోడల్ గా నిలిపారు. దేశానికి తన అవసరం ఉందని గ్రహించారు.
ఆ దిశగా సుధీర్ఘ ఆలోచన, ఆధ్యయనం, చర్చల అనంతరం టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా ముందుకు తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఆ దిశగా దేశంలోని ప్రాంతీయ పార్టీల అధినేతలందరితో చర్చలు జరిపారు. కేసీఆర్ కలిసిన ప్రతీ జాతీయనేత బీఆర్ఎస్ ఆలోచనను మెచ్చుకున్నారు. పార్టీని జాతీయపార్టీగా మార్చడమే కాదు.. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి మీరే మార్గదర్శనం చేసి నాయకత్వం వహించాలని కోరారు. దీంతో కేసీఆర్ బీఆర్ఎస్ పనుల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. ఒకవైపు రాష్ట్ర పాలనా.. మరోవైపు పార్టీ పనులను చక్కబెడుతూ.. దేశ రాజకీయాల్లోనే అపూర్వమైన ఘట్టాన్ని ఆవిష్కరించారు. దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, జేడీఎస్ అధినేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, తమిళనాడుకు చెందిన విడుతలై చిరుతైగల్ కచ్చి పార్టీ ఎంపీ చిదంబరంతో పాటు పలు పార్టీల నేతలు, రైతు సంఘాల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం ప్రారంభానికి ముందు కేసీఆర్ సతీ సమేతంగా రాజశ్యామల యాగం నిర్వహించారు.