ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 68వ పుట్టిన రోజును పురస్కరించుకొని శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతి మొదలుకొని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా తమ శుభాకాంక్షలను తెలిపారు. కాగా…తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా సీఎం కేసిఆర్ తన ట్విట్టర్ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసిన ఉద్యమకారుడు కేసీఆర్ అని, అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపిన పరిపాలనాదక్షుడని వారు కొనియాడారు. నేడు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ సేవలు మున్ముందు దేశానికీ ఎంతో అవసరమని తమ అభిప్రాయాలను, ఆకాంక్షలను అన్నివర్గాల ప్రజల ఆట పాటలు, మాటలు, ప్రకటనల ద్వారా స్పష్టంగా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, తను ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలని వారు ఆకాంక్షించారు.
తెలంగాణతోపాటు, మనదేశంలోని వివిధ రాష్ట్రాల్లోని, ఇతర దేశాల్లోని కేసీఆర్ అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ జన్మదినాన్ని అంగరంగ వైభవంగా, పండుగ వాతావరణంలో నిర్వహించారు. రక్తదానం, అన్నదానం, పేదలకు, వృద్ధులకు, అంధులకు సాయం అందించే పలు వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ తమ అభిమాన నాయకుడు ఆరోగ్యంగా ఉండాలని కాంక్షించారు.
సీఎం కేసీఆర్ జీవిత చరిత్రలను తెలియజేసే విధంగా పలు డాక్యుమెంటరీలు విడుదలయ్యాయి. ప్రముఖ రచయితలు వ్యాసాల ద్వారా, కవులు తమ పాటలు, కవితలు, ప్రకటనల ద్వారా సీఎం కేసీఆర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా అనేక పాటలు విడుదలయ్యాయి. సోషల్ మీడియాలో, టీవీ చానళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో ఈ పాటలు మార్మోగాయి. తెలంగాణ సాధించడం, సాధించుకున్న తెలంగాణను నిలబెట్టడం, దేశం గర్వించే స్థాయిలో ప్రగతిపథంలో నడిపించడాన్ని గర్వంగా భావిస్తూ, కేసీఆర్ ను కొనియాడారు.