కన్న తల్లిని, జన్మ భూమిని మరిచిపోవద్దన్నారు పెద్దలు. ఎంపీ జోగినపల్లి సంతోష్ ఆ మాటను తూ.చ తప్పకుండా పాటిస్తానని నిరూపించుకున్నారు. తాను పుట్టిన పేట్ల బుర్జు ప్రభుత్వ హస్పిటల్ అభివృద్ధికి ఎంపీ నిధుల నుండి కోటి రూపాయలు కేటాయించారు. తనకు పురుడు పోసిన దవాఖానాను మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని, అభివృద్ధి కోసం నిధులు ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు మంత్రి హరీశ్ రావు. ఎంపీ సంతోష్ కుమార్ నిర్ణయం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుందని.. తద్వారా ప్రభుత్వ హస్పిటల్స్ అభివృద్ధికి చాలామంది ముందుకు వస్తారని ఆయన అన్నారు.
పేట్ల బుర్జు ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి హరీశ్ రావు. ఎంపీ సంతోష్ కుమార్ ను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన వారు.. ఆయా హాస్పిటల్స్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. పేట్ల బుర్జు ఆస్పత్రిలో అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేసి.. సమస్యలు తీర్చేలా నిధులు వినియోగించాలని సూపరింటెండెంట్ ను మంత్రి హరీశ్ ఆదేశించారు.