తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం.. ఎన్నో ఉద్యమాలు, మరెన్నో బలిదానాలు. అంతకుముందు నిజాం వ్యతిరేక పోరాటాలు.. కాశీం రజ్వీ అరాచకాలు, తెలంగాణ సాయుధ పోరాటం, హైదరాబాద్ విలీన ఉద్యమాలు. అన్నింటి ఫలితం ప్రత్యేక హైదరాబాద్ రాష్ట్రం. అనంతరం ఆంధ్రుల కుట్రల కత్తుల మీద ఏర్పడిన సమైక్య ఆంధ్ర ప్రదేశ్. అది ఏర్పడిన నాటి నుంచే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన. నిధుల తరలింపులు, ఉద్యోగాల కబ్జాలు, నీటి దోపిడీలు వాటిని ఎదిరిస్తూ 1969 ఉద్యమం. పదుల సంఖ్యలో కమిటీలు, అష్ట సూత్రాలు, ఆరు సూత్రాలు, 610 జీఓలు అన్నీ ఉల్లంఘనలే. అన్నింటినీ ఎదిరించి తెలంగాణ సాధించుకున్నాం.
తెలంగాణ రాష్ట్రం సాధించడమే ప్రధాన ధ్యేయంగా కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) 2001, ఏప్రిల్ 27న ‘తెలంగాణ రాష్ట్ర సమితి’(టీఆర్‌ఎస్)ను ఏర్పాటు చేశారు. అందుకోసం కేసీఆర్.. తెలుగు దేశం పార్టీ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీ శాసన సభ్యత్వానికి రాజీనామ చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తదితర మేధావులు కేసీఆర్‌కు మద్దతుగా నిలిచారు.
రాష్ట్ర ఏర్పాటు కోసం ఆవిర్భవించిన పార్టీలు
1) తెలంగాణ ప్రజాసమితి – డా. మర్రి చెన్నారెడ్డి
2) జై తెలంగాణ పార్టీ -పి.ఇంద్రారెడ్డి
3) తెలంగాణ సాధన సమితి-ఆలె నరేంద్ర
4) తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ – కొండాలక్ష్మణ్ బాపూజీ
5) నవ తెలంగాణ పార్టీ- టి. దేవెందర్ గౌడ్
6) తెలంగాణ నగారా సమితి- నాగం జనార్దన్ రెడ్డి
7) తల్లి తెలంగాణ పార్టీ- విజయ శాంతి
8) తెలంగాణ రాష్ట్ర సమితి – కే. చంద్రశేఖర్ రావు
అయితే ఈ పార్టీలు తెలంగాణ రాష్ట్రంకోసం ఏర్పడినప్పటికీ.. వీటిలో ఒక్క పార్టీ తప్ప, మిగతావన్నీ ఎక్కువకాలం మనుగడ సాగించలేకపోయాయి.